

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో ఓ అనవసర రికార్డును సమం చేశాడు. శుక్రవారం మౌంట్ మాంగనూయిలోని బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీ నాలుగు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో వన్డేల్లో అతడి డకౌట్ల సంఖ్య 20కి చేరింది. ఈ ఫార్మాట్‌లో అత్యధికసార్లు డకౌట్ అయిన భారత బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్‌తో కలిసి కోహ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే సచిన్ 463 మ్యాచ్‌ల్లో 20 డకౌట్లు నమోదు చేయగా, కోహ్లీ కేవలం 321 మ్యాచ్‌ల్లోనే ఈ సంఖ్యను చేరుకోవడం గమనార్హం.
ఈ జాబితాలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ 19 డకౌట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చెరో 18 డకౌట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక వన్డే క్రికెట్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డకౌట్లు నమోదు చేసిన ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య ఉన్నాడు. తన కెరీర్‌లో 433 ఇన్నింగ్స్‌లు ఆడిన జయసూర్య 34 సార్లు డకౌట్ అయ్యాడు. సచిన్ నెలకొల్పిన పలు రికార్డులను అధిగమించిన కోహ్లీ, ఇప్పుడు ఆయనతో కలిసి ఈ అనవసర రికార్డులోనూ నిలిచాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!