

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ శుక్రవారం (12.12.2025) సాయంత్రం ఫలక్ నమా ప్యాలెస్‌లో ప్రోగ్రాం కోసం హైదరాబాద్ సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అభిమానులకు మెస్సితో ప్రత్యేకంగా ఫోటో దిగే అవకాశం కల్పించబడింది. అయితే ఈ అనుభవం కోసం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క ఫోటోకు రూ.9.95 లక్షలు (జీఎస్టీ అదనం) నిర్ణయించారని ‘ది గోట్ టూర్’ హైదరాబాద్ నిర్వాహకుల సలహాదారు పార్వతిరెడ్డి తెలిపారు. ఈ టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి, అలాగే కేవలం 100 మందికే ఈ అవకాశం ఉండనుంది.
మెస్సీ ఈ నెల 13 న సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు ఆయన ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయనతో పాటు రోడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), లూయిస్ సువారెజ్ (ఉరుగ్వే) కూడా హాజరవుతారు. కార్యక్రమంలో సింగరేణి ఆర్ఆర్-9 జట్టు, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్‌తో 20 నిమిషాల ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఇందులో 15 మంది చిన్నారులు పాల్గొంటారు. వీరిలో ఐదుగురు శిక్షణ పొందినవారు కాగా, మిగతా 10 మంది ప్రతిభ ఉన్నా శిక్షణకు అవకాశం దొరకని పిల్లలు.
ఈ మ్యాచ్ చివరి ఐదు నిమిషాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగనున్నారు. అనంతరం ఫుట్‌బాల్ క్లినిక్ ఏర్పాటు చేస్తారు. యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మెస్సి చిన్నారులకు ఫుట్‌బాల్ నేర్చుకోవడం, ఆడడం, ప్రాక్టీస్ చేయడం గురించి సూచనలు ఇస్తారు. పెనాల్టీ షూటౌట్ నిర్వహించి, విజేతలకు మెస్సీ స్వయంగా బహుమతులు అందజేస్తారు.
తర్వాత జరిగే పరేడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్సిని సత్కరించనున్నారు. మెస్సీ స్టేడియంలో దాదాపు గంటసేపు ఉంటారు. రాత్రికి హైదరాబాద్‌లోనే బస చేసి, మరుసటి రోజు ముంబయికి బయలుదేరుతారు. ఈవెంట్ మొత్తం మూడు గంటలు కొనసాగనుందని, మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. క్రికెటర్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!