

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ క్రికెట్ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసిన రూట్, అంతర్జాతీయ క్రికెట్లో 22,000 పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 380 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రూట్, సగటు 49.21తో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో రూట్ కంటే ముందున్న వారు సచిన్ టెండూల్కర్, కుమార్ సంగక్కార, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్, మహేళ జయవర్ధనే, జాక్ కాలిస్, రాహుల్ ద్రవిడ్, బ్రియన్ లారా మాత్రమే.
అదే సమయంలో, బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 152 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లాండ్, తొలి ఇన్నింగ్స్‌లో 110కే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 132 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్‌కు 175 లక్ష్యం లభించింది. కీలక దశల్లో హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ నిలకడగా ఆడడంతో ఇంగ్లాండ్ లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్‌పై కొనసాగుతున్న ఆసీస్ అపరాజిత పరంపరకు తెరపడింది. అయితే సిరీస్‌ను మాత్రం ఆస్ట్రేలియా 3-1తో ఇప్పటికే కైవసం చేసుకుంది.









.jpeg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!