

అహ్మదాబాద్‌లో జరుగుతున్న కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ఉగాండాపై 35-15తో ఘన విజయం సాధించి తొలి కామన్వెల్త్ మహిళల కబడ్డీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. కెప్టెన్ నిధి శర్మ నేతృత్వంలోని భారత జట్టు టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఆరు విజయాలతో స్వర్ణ పతకాన్ని అందుకుంది. ఫైనల్లో సాక్షి 9 రైడ్ పాయింట్లతో రాణించగా.. అను 6, నిధి శర్మ 5 పాయింట్లు సాధించారు. రీతు, సుమన్ చెరో నాలుగు ట్యాకిల్ పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
తొలి అర్ధభాగంలో భారత్ 22-7తో ఆధిక్యంలో నిలిచి మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ క్రమంలో ఉగాండాపై రెండు ఆలౌట్లు సాధించింది. రెండో అర్ధభాగంలో ఉగాండా పోటీ ఇచ్చినప్పటికీ, మరో ఆలౌట్‌తో భారత్ విజయాన్ని ఖరారు చేసుకుంది. ఫైనల్లో సాక్షి ఆరు మ్యాచ్‌ల్లో మొత్తం 52 పాయింట్లు సాధించి టోర్నీలో భారత జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అంతర్జాతీయ టోర్నీలు కబడ్డీ అభివృద్ధికి, యువ క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడతాయని ఆమె పేర్కొంది. గ్రూప్ దశలో మలేషియా, సింగపూర్, ఉగాండా, నైజీరియాలను ఓడించిన భారత్.. సెమీఫైనల్లో శ్రీలంకపై గెలిచి ఫైనల్‌కు చేరింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!