

మహారాష్ట్ర సచివాలయం ‘మంత్రాలయ’లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ ఎలుక మూడు రోజుల పాటు అధికారులకు ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు దానిని పట్టుకోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వార్త సచివాలయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. కీలక దస్త్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్న ఓ గదిలో ఎలుక సంచరిస్తున్నట్లు సిబ్బంది గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఎలుకను పట్టుకునేందుకు అధికారులు తొలుత బోన్లను ఏర్పాటు చేశారు. వాటిలో ఆహారం ఉంచినప్పటికీ అది చిక్కలేదు. దీంతో చివరకు జిగురు ప్యాడ్‌లపై ఆహారం పెట్టి ఎలుకను బంధించారు. కాగా, మంత్రాలయలో ఎలుకల బెడద కొత్తేమీ కాదు. గతంలోనూ వాటి సంచారం ఎక్కువగా ఉండటంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 2018లో ఎలుకలను పట్టుకునేందుకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆ బృందం రోజుకు సగటున పది ఎలుకలను పట్టుకునేది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!