

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో టీమిండియా పేసర్లు ఆరంభంలో అదరగొట్టారు. తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి కివీస్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే ఆ తర్వాత బౌలర్లు అదే జోరు కొనసాగించలేకపోయారు. రెండో సెషన్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా 3/52తో ఆకట్టుకున్నప్పటికీ.. అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదు. మరోవైపు మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించారు.
సిరాజ్‌ను పక్కన పెట్టడం జట్టు యాజమాన్యం తీసుకున్న తప్పుడు నిర్ణయం కాదని సితాన్షు కోటక్ స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు కోసం ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్ అత్యుత్తమమైనదేనని ఆయన సమర్థించారు. టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు ఆటను మాత్రమే పరిగణనలోకి తీసుకుని జట్టు ఎంపికను తప్పుబట్టడం సరికాదని, మ్యాచ్‌లో ఇంకా చాలా రోజుల ఆట మిగిలి ఉందని పేర్కొన్నారు. వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని వివరించారు. న్యూజిలాండ్ జట్టులో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటంతో సుందర్‌కు అవకాశం కల్పించామని తెలిపారు. ప్రస్తుతం కూడా ఇదే అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ అని తమకు నమ్మకం ఉందని కోటక్ వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!