

టీమిండియా బ్యాటర్ సంజు శాంసన్ తన కెరీర్‌పై వస్తున్న విమర్శలు, మాజీ ఆటగాళ్ల వ్యాఖ్యల గురించి స్పందించాడు. బయటివాళ్లు తన గురించి ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. అయితే కొన్నిసార్లు సోషల్ మీడియాలో వచ్చే వ్యాఖ్యలు తనను కూడా ప్రభావితం చేస్తాయని అంగీకరించాడు. అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20లో 22 బంతుల్లో 57 పరుగులతో మెరిసిన అనంతరం మాట్లాడిన శాంసన్.. ప్రతి ఒక్కరికీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని, సానుకూలంగా మాట్లాడినా, విమర్శించినా వాటిని ఎలా స్వీకరించాలో ఇప్పుడు తనకు తెలుసని పేర్కొన్నాడు. తాను రోబోను కాదని, కొన్ని వ్యాఖ్యలు బాధ కలిగిస్తాయని, అయితే తనను తాను సర్దిచెప్పుకుంటానని తెలిపాడు.
ఇక టీమిండియా టాప్ ఆర్డర్‌లో చోటు కోసం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీతో పోటీపై కూడా శాంసన్ స్పందించాడు. భారత జట్టును ఎంపిక చేయడం, నడిపించడం అంత సులభమైన విషయం కాదని పేర్కొన్నాడు. తాను ప్రపంచకప్‌లో రాణించిన తర్వాత వైభవ్ కూడా అద్భుతంగా ఆడాడని, అతడు జట్టులోకి రావాల్సినంతగా తన ప్రతిభను చూపించాడని చెప్పాడు. వ్యక్తిగత పోటీగా కాకుండా జట్టు అవసరాల దృష్టితోనే ఎంపికలను చూడాలని శాంసన్ వ్యాఖ్యానించాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!