

ట్రంప్ ప్రభుత్వం అమెరికన్లకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో హెచ్-1బీ వీసా విధానాలను కఠినతరం చేస్తున్న వేళ భారత సంతతి సీఈఓ, ‘సర్కిల్ ప్లస్ పే’ వ్యవస్థాపకుడు నితీశ్ కన్నన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు ఉద్యోగాలు లభించకపోతే అందుకు హెచ్-1బీ వీసాదారులను నిందించడం సరికాదని అన్నారు. అమెరికాలో అందుబాటులో ఉన్న మొత్తం ఉద్యోగాలతో పోలిస్తే ఏటా జారీ అయ్యే హెచ్-1బీ వీసాల సంఖ్య చాలా తక్కువని పేర్కొంటూ.. ఈ వీసా విధానం వల్లే అమెరికన్లకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయన్న వాదనను తప్పుబట్టారు.
అర్హత కలిగిన అమెరికన్లు అందుబాటులో ఉన్నప్పుడు కంపెనీలు హెచ్-1బీ వీసాదారులను నియమించుకోవడానికి ఆసక్తి చూపవని నితీశ్ కన్నన్ అన్నారు. హెచ్-1బీ ఉద్యోగిని నియమించుకోవడానికి అదనపు ఖర్చుతో పాటు క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు. ఉద్యోగాలు అందుబాటులో ఉన్నప్పటికీ తమకు ఉపాధి దక్కడం లేదని చెప్పడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యలపై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ అమెరికా విడిచి వెళ్లాలని చెబుతున్నారని నితీశ్ తెలిపారు. అయితే తాను అమెరికాలోనే జన్మించానని, తాను ఆ దేశ పౌరుడినేనని విమర్శకులకు సమాధానమిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!