

ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలో క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు వీలుగా జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ.7,386 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. 2026-27 నుంచి 2030-31 మధ్య ఈ నిధులను వినియోగించనున్నారు. ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు, జట్లకు ఈ నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు.
మొత్తం బడ్జెట్‌లో 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడల కోసం రూ.2,500 కోట్లు కేటాయించారు. క్రీడాకారుల శిక్షణ కోసం రూ.4,236.74 కోట్లు, క్రీడల నిర్వహణ కోసం రూ.3,150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిధులతో క్రీడా సమాఖ్యలను బలోపేతం చేయడంతో పాటు క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, సన్నద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అలాగే భారత్ ఆతిథ్యమిచ్చే అంతర్జాతీయ క్రీడా టోర్నీలను సమర్థంగా నిర్వహించేలా సమాఖ్యలను ప్రోత్సహించనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!