

బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇబ్రహీంపట్నం రామదాస్‌పల్లిలో 300 ఎకరాలకు పైగా రైతుల పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని ఆయన ఎక్స్‌లో ఆరోపించారు. దీంతో రైతుబంధు, రైతుబీమా, బ్యాంకు రుణాలు, యూరియా వంటి సదుపాయాలు అందడం లేదని పేర్కొన్నారు. రైతులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కలెక్టర్, ఎమ్మార్వో తదితర అధికారులను కలిసినా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఆర్డీవో నివేదికలో సైతం ఆ భూములు రైతులవేనని స్పష్టంగా పేర్కొన్నట్లు హరీశ్ రావు తెలిపారు.
రైతుల భూములను 22ఏ జాబితా నుంచి ఎందుకు తొలగించడం లేదని హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూముల విషయంలో 30 శాతం కమిషన్ల కోసం ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆయన చేసిన ఆరోపణలను ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఒక్క ఎకరా కూడా కొత్తగా 22ఏ జాబితాలో చేర్చలేదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చెబుతున్న నేపథ్యంలో రామదాస్‌పల్లి భూములు ఆ జాబితాలోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రెండు రోజుల్లో బీఆర్‌ఎస్ బృందం రామదాస్‌పల్లికి వెళ్లి రైతులకు న్యాయం జరిగే వరకు ధర్నా చేపడుతుందని హెచ్చరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!