

భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ నెల 22 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టీ20ల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో 36 ఏళ్ల భువనేశ్వర్‌కు కూడా స్థానం లభించింది. తాత్కాలిక సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రజ్ఞాన్ ఓజా నేతృత్వంలోని బృందం ఈ ఎంపిక చేసింది. 2022 నవంబర్‌లో న్యూజిలాండ్‌పైనే భువనేశ్వర్ చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడాడు. 2026 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు తీసి, జట్టు టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించడంతో అతని పునరాగమనానికి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా కివీస్‌తో సిరీస్ ద్వారా జాతీయ జట్టులోకి తిరిగి రానున్నాడు.
న్యూజిలాండ్‌తో భారత్ ఐదు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌ల్లోనూ తలపడనుంది. ఈ నెల 24 నుంచి న్యూజిలాండ్-ఎతో మూడు అనధికారిక టెస్టులు ఆడే భారత్-ఎ జట్టును కూడా సెలెక్టర్లు ప్రకటించారు. ధ్రువ్ జురెల్ సారథ్యం వహించనున్న ఈ జట్టులో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, ఆకాశ్ దీప్ తదితరులు ఉన్నారు. అజిత్ అగార్కర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత జట్ల ఎంపిక జరగడం ఇదే తొలిసారి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!