

పాన్ ఇండియా సినిమాల పేరుతో పెద్ద మోసం జరుగుతోందని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యానించారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు నిర్మించే ధోరణి అసలైన సినిమా స్ఫూర్తిని దెబ్బతీస్తోందని, చిన్న చిత్రాల మనుగడకు ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని డా.బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శనివారం ప్రారంభమైన రెండు రోజుల ఛాయ సాహిత్యోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా రంగంలో నెలకొన్న పరిస్థితులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. దక్షిణ భారతదేశంలో మంచి సినిమాలు రూపొందుతున్నాయని ప్రశంసించడంతో పాటు, మానవ జీవితంలో సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి ఇతర భారతీయ భాషలతో పాటు అంతర్జాతీయ సాహిత్యంతో అనుబంధాన్ని పెంపొందించడమే ఈ ఉత్సవం లక్ష్యమని తెలిపారు. ‘సమాజాన్ని కదిలించే సాహిత్యం ఎందుకు అవసరం?’ అనే అంశంపై సినీ నటి రోహిణి, తమిళ రచయిత్రి, డీఎంకే మాజీ ఎంపీ సల్మా, సాహితీవేత్త మృణాళిని, కశ్మీరీ కవయిత్రి నిఘత్ సాహెబా చర్చించారు. కవిత్వం, ప్రపంచీకరణ, పరాయీకరణ అంశాలపై అమెరికా రచయిత పీటర్ కాన్‌స్టాంటైన్, కవి యాకూబ్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ‘మూసీ తీరపు జ్ఞాపకాలు, రచనల్లో హైదరాబాద్ చారిత్రక వారసత్వం’ అనే అంశంపై రాహుల్ మిలింద్ ఘంటా, డా. ఎం.డి. సఫీయుల్లా, నయీం చర్చించారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్, పాశం యాదగిరి, రచయిత్రి కుప్పిలి పద్మ తదితరులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!