

ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కార్యాలయాలు, పరిశ్రమల్లో నీటి వృథాను అరికట్టేందుకు డిజిటల్ ట్విన్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లోని స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా కనీసం 20 శాతం నీటి వృథాను తగ్గించవచ్చని చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఎల్‌నినో ప్రభావం కొనసాగవచ్చన్న అంచనాల నేపథ్యంలో నీటి పొదుపునకు ఈ సాంకేతికత మంచి పరిష్కారంగా నిలుస్తుందని వివరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు 130 లీటర్ల నీరు అవసరం. అయితే స్నానం, దుస్తులు ఉతకడం, వంటపాత్రలు శుభ్రం చేయడం, మొక్కలకు నీరు పోయడం, వాహనాలు కడగడం వంటి రోజువారీ పనుల్లో పెద్ద మొత్తంలో నీరు వృథా అవుతోంది.
డిజిటల్ ట్విన్ విధానంలో నీటి సరఫరా పైప్‌లైన్లు, స్టోరేజ్ ట్యాంకులు, వాల్వులకు సెన్సర్లు అమర్చి నీటి ప్రవాహం, వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ద్వారా అనుసంధానమైన ఈ సెన్సర్లు పైప్‌లైన్ లీకేజీలు, నీటి ఒత్తిడి తగ్గడం, సరఫరాలో అంతరాయాలను గుర్తించి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాచారం అందిస్తాయి. అపార్ట్‌మెంట్లలో ప్రతి ఫ్లాట్ ఎంత నీటిని వినియోగిస్తోందో తెలుసుకోవడంతో పాటు, నల్లాలు తెరిచి వదిలేస్తే హెచ్చరికలు పంపడం, అవసరమైతే ఆటోమేటిక్‌గా నీటి సరఫరాను నిలిపివేయడం సాధ్యమవుతుంది. గేటెడ్ కమ్యూనిటీల్లో అధికంగా నీరు వినియోగించే సమయాలను గుర్తించి సరఫరా ఒత్తిడిని నియంత్రించడం ద్వారా కూడా నీటిని ఆదా చేయవచ్చు. నీటి పొదుపుతో పాటు నాణ్యత, కాలుష్య స్థాయులను పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నీటి నిర్వహణకు చేస్తున్న ఖర్చుతో పోలిస్తే తక్కువ వ్యయంతోనే ఈ సాంకేతికతను ఏర్పాటు చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!