

తెలుగు రాష్ట్రాల నుంచి కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి, పెంటేల హరికృష్ణ, అర్జున్ ఎరిగైసి, లలిత్‌బాబు, రాజా రిత్విక్ వంటి పలువురు ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఇప్పుడు వారి బాటలోనే మరో యువ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల మోదుపల్లి దీక్షిత చదరంగంలో అద్భుతమైన ప్రదర్శనలతో వేగంగా ఎదుగుతోంది. అండర్-16 విభాగంలో ప్రపంచ అగ్రస్థానానికి చేరుకున్న దీక్షిత.. ఇటీవలే తన తొలి ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్‌ను సాధించి మరో కీలక మైలురాయిని అందుకుంది.
అనంతపురం జిల్లా హంపాపురానికి చెందిన దీక్షిత కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఆమె తండ్రి శేషాద్రి నాయుడు సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని వెలాసిటీ చెస్ అకాడమీలో ఇంటర్నేషనల్ మాస్టర్ కృష్ణతేజ వద్ద దీక్షిత చెస్‌లో శిక్షణ పొందింది. జాతీయ అండర్-13 ఛాంపియన్‌షిప్, జాతీయ పాఠశాల క్రీడల చెస్‌లో విజేతగా నిలిచిన ఆమె.. ఆ తర్వాత యూరోపియన్ సర్క్యూట్‌లోనూ సత్తా చాటింది. స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్ వంటి దేశాల్లో జరిగిన టోర్నీల్లో మెరుగైన ర్యాంకుల్లో ఉన్న పలువురు క్రీడాకారులను ఓడించింది. ఆమె రేటింగ్ కూడా అతి తక్కువ సమయంలో భారీగా పెరిగింది. తప్పిదం జరిగినా వెనక్కి తగ్గకుండా చివరి వరకు పోరాడే మానసిక బలమే దీక్షిత ప్రత్యేకత అని ఆమె కోచ్ కృష్ణతేజ తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!