

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే ఎన్నికల సంఘం ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్వహించిందని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అసలైన ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించారని, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆమె అన్నారు. శనివారం సేరంపోర్‌లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన మమతా.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియలోని కొన్ని అంశాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఆమె పేర్కొన్నారు. సీఈసీ రాజీనామా చేయకపోతే బెంగాల్ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు. ఈనెల 30న ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఇండియా కూటమి సమావేశం జరుగుతుందని చెప్పారు.
సేరంపోర్ ర్యాలీకి హాజరుకాకుండా తమ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు గృహ నిర్బంధం చేశారని మమతా ఆరోపించారు. తనను కూడా ర్యాలీ వేదిక వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని, దీంతో ప్రత్యామ్నాయ మార్గంలో సేరంపోర్‌కు చేరుకున్నానని తెలిపారు. ర్యాలీకి వస్తున్న టీఎంసీ నేతలపై దాడులు జరిగినప్పటికీ వారికి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. అయితే మమతా బెనర్జీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. టీఎంసీ నేతలపై జరిగినట్లు చెబుతున్న దాడుల్లో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధి దేవ్‌జిత్ సర్కార్ తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!