

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఐదో వారంలోకి అడుగుపెట్టడంతో డే 29 నామినేషన్స్ ప్రక్రియ హౌస్‌లో ఒక్కసారిగా వేడిని పెంచింది. కంటెస్టెంట్లు గతంలో జరిగిన గొడవలను మరోసారి ప్రస్తావిస్తూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. మాటల యుద్ధాలు క్రమంగా వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లడంతో హౌస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అపూర్వ, ముకేశ్ మధ్య జరిగిన వాగ్వాదం ఎపిసోడ్లో ప్రధాన హైలైట్‌గా నిలిచింది.
ఈసారి నామినేషన్స్ కోసం బిగ్‌బాస్ ఆపిల్ టాస్క్‌ను నిర్వహించారు. బాక్స్ కింద దాచిన ఆపిల్‌ను ముందుగా దక్కించుకున్న కంటెస్టెంట్‌కు ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. ఆపిల్ దక్కని వారికి ఒకరిని మాత్రమే నామినేట్ చేసే అవకాశం కల్పించారు. మొదటి రౌండ్లో ముకేశ్‌ను దాటుకుని రామ్ ప్రసాద్ ఆపిల్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో ఆయన త్రిగుణ్, అమన్‌లను నామినేట్ చేశారు. త్రిగుణ్ గేమ్‌లో అతిగా అగ్రెసివ్‌గా వ్యవహరిస్తున్నారని రామ్ ప్రసాద్ కారణంగా చెప్పారు.
ఆపిల్ దక్కించుకోలేకపోయిన ముకేశ్.. అపూర్వను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కెప్టెన్సీ సమయంలో అపూర్వ వ్యవహరించిన తీరు తనకు నచ్చలేదని, ఆమె పక్షపాతంగా వ్యవహరించిందని ముకేశ్ విమర్శించారు. దీనికి అపూర్వ ఘాటుగా స్పందిస్తూ ముకేశ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో వర్షిణి ప్రభావం ఉందని ఆరోపించారు. ఈ క్రమంలో వ్యక్తిగత విషయాలు కూడా చర్చలోకి రావడంతో వాగ్వాదం మరింత తీవ్రంగా మారింది.
తదుపరి రౌండ్లో త్రిగుణ్ ఆపిల్‌ను దక్కించుకుని అపూర్వను నామినేట్ చేశారు. గతంలో తన లుక్స్‌పై అపూర్వ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ త్రిగుణ్ వ్యంగ్యంగా స్పందించారు. దీంతో నామినేషన్స్ ప్రక్రియలో వ్యక్తిగత విమర్శలు మరింత పెరిగాయి. మొత్తం ప్రక్రియ ముగిసే సమయానికి త్రిగుణ్, అమన్, అపూర్వ, రోహిత్, చరణ్, షాలిని తదితరులు ఎలిమినేషన్ బరిలో నిలిచారు. వీరిలో చరణ్, షాలినీ ఆటతీరుపై ప్రేక్షకుల్లో అసంతృప్తి ఉందనే చర్చ సాగుతోంది. వారాంతంలో నాగార్జున ఈ గొడవలపై ఎలా స్పందిస్తారు, ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!