

సీనియర్ హీరోలు తమకంటే చాలా చిన్న వయసున్న కథానాయికలతో రొమాంటిక్ పాత్రల్లో నటించడంపై ఇటీవల ట్రోలింగ్, విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనకు ఎదురైన ఓ ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. తన తాజా చిత్రం ‘కింగ్’ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన.. ఓ సినిమాలో తనకంటే తక్కువ వయసున్న నటితో కలిసి రొమాంటిక్ సీన్‌లో నటించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. సినిమా పేరు, ఆ నటి వివరాలను వెల్లడించకుండా.. ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశంలో అనుకోకుండా ఆమెను ‘రేపటి మ్యాథ్స్ హోంవర్క్ పూర్తి చేశావా బేటీ?’ అని అడిగానని చెప్పారు. ఆ సంఘటనతో తనకు, తనతో జోడీగా నటించే కథానాయికలకు మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉంటోందని గుర్తించానని, అప్పటి నుంచి తన వయసుకు తగ్గ పాత్రలనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం తన వయసు 61 ఏళ్లని, ‘కింగ్’ సినిమాలో తన పాత్ర కూడా అందుకు తగ్గట్టుగానే సహజంగా ఉంటుందని షారుఖ్ చెప్పారు. సినిమాలో కూర్చున్నా, నిల్చున్నా, డైలాగులు చెప్పినా తన వయసుకు తగినట్లుగా కనిపిస్తానని పేర్కొన్నారు. తన కుమార్తె సుహానా ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తోందని, యువ ప్రేక్షకులు తనను తెరపై చూసి తమ తండ్రులు కూడా ఇలాగే కూల్‌గా ఉంటారని భావిస్తారని అన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కింగ్’ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!