

బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్‌లో పన్నెండో వారం కొనసాగుతున్న బడ్డీ అప్ థీమ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ థీమ్‌లో భాగంగా ఇప్పటికే పలువురు మాజీ కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి ప్రస్తుత సభ్యులతో కలిసి వివిధ టాస్కుల్లో పాల్గొన్నారు. గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో వీజే సన్నీ, సిరి, నిఖిల్, పృథ్వీ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వారు ఇంటి సభ్యుల ఆటతీరుపై తమ అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు పలు సూచనలు చేశారు.
ముందుగా వీజే సన్నీ, సిరి ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడారు. త్రిగుణ్ ఆటతీరుపై సన్నీ తనదైన శైలిలో సెటైర్లు వేయగా, వంశీని బయట విలన్ అయినా ఇంట్లో హీరో అంటూ ప్రశంసించారు. సుధీర్‌కు తన తల్లి ఆశీర్వాదమే బలమని చెప్పారు. వర్షిణి ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ఆడాలని, ఆటలో వ్యక్తిగత సంబంధాలను పక్కన పెట్టాలని సూచించారు. మరోవైపు నరేష్ ఆటతీరును సిరి మెచ్చుకుంటూ అతనిపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
ఆ తర్వాత సన్నీ నరేష్‌కు, సిరి వర్షిణికి బడ్డీలుగా మారి టాస్కులో పాల్గొన్నారు. గోడను పగలగొట్టి ముందుకు వెళ్లాల్సిన ఈ పోటీలో నరేష్ తన శారీరక బలాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించి వేగంగా టాస్కును పూర్తి చేశాడు. సన్నీ కూడా సమతుల్యతను అద్భుతంగా ప్రదర్శించి నరేష్ విజయానికి తోడ్పడ్డాడు. మరోవైపు వర్షిణి గోడను పగలగొట్టడంలో ఇబ్బంది పడటంతో వెనుకబడిపోయింది. ఓటమి అనంతరం తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయానంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అయితే వర్షిణి బాగా ఆడిందంటూ బిగ్‌బాస్ ప్రోత్సహించడంతో కాస్త శాంతించింది.
అనంతరం నిఖిల్, పృథ్వీ హౌస్‌లోకి వచ్చి సభ్యులకు పలు సూచనలు చేశారు. త్రిగుణ్, వంశీ కోపాన్ని నియంత్రించుకోవాలని నిఖిల్ సలహా ఇచ్చాడు. వర్షిణి, దేబ్జానీ సొంతంగా ఆటపై దృష్టి పెట్టాలని సూచించాడు. ఆ తర్వాత నిఖిల్, పృథ్వీ కలిసి అన్‌లాక్ అండ్ బిల్డ్ పిరమిడ్ టాస్కును నిర్వహించారు. నిఖిల్ సుధీర్‌కు, పృథ్వీ వంశీకి బడ్డీలుగా నిలిచారు. సిలిండర్లను అన్‌లాక్ చేసి పిరమిడ్ నిర్మించాల్సిన ఈ పోటీలో సుధీర్ వేగంగా టాస్కును పూర్తి చేయగా, వంశీ వెనుకబడ్డాడు. దీంతో సుధీర్ విజయం సాధించాడు.
ఈ విజయాలతో పాటు గతంలో సాధించిన అర్హతల ఆధారంగా ఆర్కే, శివ్, దేబ్జానీ, అమన్, నరేష్, సుధీర్ కెప్టెన్సీ రేసులో నిలిచారు. దీంతో ఇంట్లో తదుపరి కెప్టెన్ ఎవరు అవుతారనే ఉత్కంఠ నెలకొంది. చివరి కెప్టెన్సీ పోరులో ఈ ఆరుగురిలో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!