

బిగ్ బాస్ తెలుగు 10లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన నీతూ మాస్టర్ ఈ వారం ఎలిమినేట్ అయింది. హౌస్‌లో కొద్దివారాలే ఉన్నప్పటికీ, మిగతా మహిళా కంటెస్టెంట్లతో పోలిస్తే ఆటల్లోనూ, మాటల్లోనూ గట్టిపోటీ ఇచ్చింది. ఎలిమినేషన్ అనంతరం హోస్ట్ శివాజీతో జరిగిన ఇంటర్వ్యూలో హౌస్‌లోని కంటెస్టెంట్ల ఆటతీరుపై తన అభిప్రాయాలను వెల్లడించింది. త్రిగుణ్ విన్నర్ అయ్యే మెటీరియల్ కాదని, ముకేష్ టాప్ 5లో కూడా చోటు దక్కించుకోకపోవచ్చని జోస్యం చెప్పింది. వర్షిణి ప్రభావం ముకేష్ ఆటపై ఉందని విమర్శించింది. ఒకే విషయాన్ని పదేపదే సాగదీస్తాడని, ఏదైనా చేయాలని ప్రయత్నించినా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడని ముకేష్ గురించి వ్యాఖ్యానించింది. అయితే వ్యక్తిగతంగా అతను మంచి మనిషేనని పేర్కొంది.
త్రిగుణ్ ప్రవర్తనపై కూడా నీతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడతాడని ఆరోపించింది. సుధీర్, ఆర్కే వంటి కంటెస్టెంట్లు ఇన్ని వారాలుగా హౌస్‌లో ఎలా కొనసాగుతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. నరేష్ మాత్రం టాప్ 5లో ఉండాలని అభిప్రాయపడింది. తాను మొదటి నుంచే హౌస్‌లో ఉండి ఉంటే కచ్చితంగా టాప్ 5కు చేరుకునేదాన్నని చెప్పింది. రోహిత్ ఎలిమినేషన్ తర్వాత తాను ఒంటరిగా భావించానని, అమన్ తనకు దగ్గరయ్యాడని తెలిపింది. తన ఏడుపు గురించి వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. తాను చిన్న విషయాలకే భావోద్వేగానికి గురవుతానని, ఏడవడం ద్వారా మనసులోని భారాన్ని తగ్గించుకుంటానని చెప్పింది. తన తల్లి తనను కొడుకులా పెంచిందని గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. టైటిల్ గెలవడం కంటే టాప్ 5లో నిలవడమే తన లక్ష్యమని, అది సాధించలేకపోయినప్పటికీ భవిష్యత్తులో తనకు మంచి జరుగుతుందని నమ్ముతున్నానని నీతూ వెల్లడించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!