

అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించేందుకు అగ్రరాజ్యాల మధ్య పోటీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అణ్వాయుధాలను అంతరిక్షంలో మోహరించినట్లు అమెరికా అంగీకరించగా.. రష్యా కూడా అదే దిశగా అడుగులు వేస్తోందని జర్మనీ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. 2026 చివరి నాటికి అణ్వాయుధంతో కూడిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు మాస్కో సిద్ధమవుతోందని జర్మన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కేవలం 60 రోజుల్లోనే అంతరిక్షంలోకి అణ్వాయుధాలను ప్రవేశపెట్టేలా రష్యా సన్నాహాలు చేస్తోందని, ఈ వ్యూహాలపై జర్మనీ ఇంటెలిజెన్స్ వర్గాలు రక్షణశాఖ మంత్రికి సమాచారం అందించినట్లు వెల్లడించాయి. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు జర్మనీ రక్షణశాఖ తెలిపింది. రష్యా నిజంగా ఈ చర్యకు దిగితే.. అంతరిక్షంలో అణు పేలుళ్లను నిషేధించే 1963 పాక్షిక అణు పరీక్షల నిషేధ ఒప్పందంతో పాటు, 1967 అంతరిక్ష ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించినట్లవుతుంది. మరోవైపు ఉక్రెయిన్, నాటో సభ్యదేశాలు తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో మాస్కో అణ్వాయుధాల వినియోగంపై ఆలోచించే అవకాశం ఉందని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ తన కథనంలో పేర్కొంది. రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది.
అయితే జర్మనీ ఇంటెలిజెన్స్ నివేదిక గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బెర్లిన్‌లోని రష్యా రాయబార కార్యాలయం కూడా ఈ నివేదికను ఖండిస్తూ, అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేసింది. కాగా, రష్యా అంతరిక్ష అణ్వాయుధ కార్యక్రమంపై అమెరికా గతంలోనూ ఆందోళన వ్యక్తం చేసింది. శత్రు ఉపగ్రహాలను ధ్వంసం చేయగల సరికొత్త అణు వ్యవస్థను మాస్కో అభివృద్ధి చేస్తోందని 2024లో ఆరోపించింది. తాజాగా ఉక్రెయిన్ సైనికులు ఉపయోగిస్తున్న స్టార్‌లింక్ ఉపగ్రహ నెట్‌వర్క్‌ను కూడా ధ్వంసం చేయగల అణ్వాయుధాన్ని రష్యా కొన్నేళ్లుగా అభివృద్ధి చేస్తోందని అమెరికా మరోసారి హెచ్చరించింది. అయితే ఈ ఆరోపణలను రష్యా గతంలోనే ఖండించింది. తాజా జర్మనీ ఇంటెలిజెన్స్ నివేదికతో అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపు, అగ్రదేశాల మధ్య కొత్త అణ్వాయుధ పోటీపై అంతర్జాతీయంగా ఆందోళనలు మరింత పెరిగాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!