

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కీలక దశకు చేరుకుంది. కంటెస్టెంట్లు 12వ వారంలోకి అడుగుపెట్టగా, ఇంట్లో దాదాపు డజను మంది సభ్యులు ఉన్నారు. మరో నాలుగు వారాల్లో షో ముగియనుండటంతో నామినేషన్ల ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారింది. చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో గ్రూపులుగా ఆడటానికి స్వస్తి పలికి, ఎవరికి వారే తమ ఆటను కొనసాగించేందుకు కంటెస్టెంట్లు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ అమన్, దేబ్జానీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నామినేషన్ల సమయంలో దేబ్జానీ అమన్‌ను పక్కకు వెళ్లమని అనడంతో అతడు కూడా తీవ్రంగా స్పందించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.
ఈ ఎపిసోడ్‌లో వర్షిణి, సుధీర్ మధ్య జరిగిన వాడివేడి వాదన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘రివార్డ్ రివేంజ్’ టాస్క్‌లో వర్షిణి వ్యవహరించిన తీరును కారణంగా చూపుతూ సుధీర్ ఆమెను నామినేట్ చేశాడు. తాను, శ్వేత కలిసి ఆడుతున్నారనే అభిప్రాయం ఇతరుల్లో ఉందని భావించి మిగతా వారికి బాల్స్ ఇచ్చినట్లు వర్షిణి వివరణ ఇచ్చింది. ముకేష్‌కు మద్దతు లభిస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు తనకు కావాలనే సపోర్ట్ చేయలేదని రామ్ ప్రసాద్ కూడా ఆరోపించాడు. అయితే వర్షిణి ఆ ఆరోపణలను ఖండించింది. సంచాలక్‌గా రోహిత్ ఉన్నప్పుడు తాను సాయం చేయడంలో తప్పేమీ లేదని వాదించింది. తన ప్రవర్తన గురించి అడిగితే ఇతరుల పేర్లు చెబుతున్నావంటూ సుధీర్ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. చివరకు వర్షిణి ముఖంపై కాఫీ కొట్టి సుధీర్ ఆమెను నామినేట్ చేశాడు.
మరోవైపు, రామ్ ప్రసాద్‌ను దేబ్జానీ నామినేట్ చేయడం కూడా చర్చనీయాంశమైంది. కెప్టెన్సీ తనకు ఎంతో ముఖ్యమని తెలిసినా, ఆ రోజు రామ్ ప్రసాద్ తనకు మద్దతుగా నిలవలేదని ఆమె కారణం చెప్పింది. ఒకవేళ తనకు కెప్టెన్ అయ్యే అవకాశం వస్తే దేబ్జానీనే ఎంపిక చేసుకుంటానని రామ్ ప్రసాద్ బదులిచ్చాడు. అయితే ఆమె నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇంత స్వార్థంగా వ్యవహరిస్తుందని ఊహించలేదని అన్నాడు. ఇక శివ్, ముకేష్‌ల ఆటతీరుపైనా చర్చ సాగుతోంది. బయట త్రిగుణ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అతడితో గొడవ పడటం ద్వారా స్క్రీన్ స్పేస్ పొందేందుకు శివ్ ప్రయత్నిస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, డిక్టేటర్‌గా ముకేష్ విఫలమైన నేపథ్యంలో ఈ వారం నామినేషన్లలో అతడిని నరేష్, రామ్ ప్రసాద్ వంటి వారు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!