

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా పుష్కరాల అధికారిక లోగో, ట్యాగ్‌లైన్ రూపకల్పన కోసం పోటీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఈ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లో విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.
పోటీల్లో ఎంపికైన వారికి మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేలు అందించనున్నారు. కళాకారులు, విద్యార్థులు, డిజైన్‌పై ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలు కూడా తమ ఎంట్రీలను పంపవచ్చు. లోగో, ట్యాగ్‌లైన్ డిజైన్లను నవంబర్ 30లోపు godavaripushkaralutg@gmail.comకు పంపాలని నిర్వాహకులు సూచించారు. తెలంగాణ సంస్కృతి, గోదావరి నది పవిత్రత, పుష్కరాల ఆధ్యాత్మిక ప్రాధాన్యత ప్రతిబింబించేలా డిజైన్లు ఉండాలని కోరారు. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలతో పాటు నది తీరంలోని ఘాట్ల వద్ద రవాణా, పారిశుద్ధ్యం, భద్రత, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!