

సినిమా పేరు: సీన్
విడుదల తేదీ: నవంబర్ 6, 2026
నటీనటులు: సూర్య శివకుమార్, నజ్రియా నజీమ్, నస్లెన్, ఆనందరాజ్, లాల్ తదితరులు
దర్శకుడు: జీతూ మాధవన్
నిర్మాతలు: జ్యోతిక, సూర్య
సంగీత దర్శకుడు: సుషిన్ శ్యామ్
సినిమాటోగ్రాఫర్: వినీత్ అగస్టియన్
ఎడిటర్: అజ్మల్ సాబు
డీఎస్పీ ప్రేమ్ రాజ్ (సూర్య) తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే క్లిష్టమైన నేర కేసులను వేగంగా ఛేదించడంలో అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో పై అధికారులు రాజీనామాను అంగీకరించరు. ఈ క్రమంలో పెర్ఫ్యూమ్ కిల్లర్ (టోవినో థామస్) హత్యల తరహాలోనే జరుగుతున్న మరో హత్య కేసును ఛేదించే బాధ్యతను అతడికి అప్పగిస్తారు. తన సహాయకురాలు మాయ (నజ్రియా నజీమ్) సాయంతో ప్రేమ్ రాజ్ దర్యాప్తు ప్రారంభిస్తాడు. అయితే ఈ క్రమంలో అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ అనూహ్య రహస్యం బయటపడుతుంది. అసలు హంతకుడు ఎవరు? ప్రేమ్ రాజ్ అతడిని ఎలా పట్టుకున్నాడు? అతడి రహస్యం దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం చూపించింది? అనేది మిగతా కథ.
దర్శకుడు జీతూ మాధవన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథకు కామెడీని జోడించిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమా ఆద్యంతం సీరియస్ వాతావరణంలో సాగకుండా, విచిత్రమైన పాత్రలు, సందర్భానుసారమైన హాస్యంతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. డీఎస్పీ ప్రేమ్ రాజ్ పాత్రలో సూర్య చాలా సహజంగా నటించారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ కొత్తగా అనిపిస్తాయి. ముఖ్యంగా తీవ్రమైన పరిస్థితులను కూడా సరదాగా ఎదుర్కొనే సన్నివేశాల్లో సూర్య నటన ఆకట్టుకుంటుంది.
మాయ పాత్రలో నజ్రియా తనదైన నటనతో మెప్పించారు. సూర్య, నజ్రియా మధ్య సంభాషణలు, కెమిస్ట్రీ సినిమాలో మంచి వినోదాన్ని అందిస్తాయి. ముఖ్యంగా మార్చురీలో వచ్చే ప్రపోజల్ సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన నస్లెన్ తనదైన శైలిలో మెప్పించారు. అతడి కూల్ యాటిట్యూడ్ విలన్ పాత్రకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. మరోవైపు సినిమాటోగ్రఫీ, సుషిన్ శ్యామ్ నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.
సినిమాలో వినోదాత్మక సన్నివేశాలు ఉన్నప్పటికీ, ప్రధానమైన హత్యల దర్యాప్తు కథనం సాధారణంగానే సాగుతుంది. ముఖ్యంగా విలన్ గతం, అతడు హత్యలు చేయడానికి గల కారణాలను బలంగా చూపించలేకపోయారు. దీంతో కథలో సంఘర్షణ అంతగా ప్రభావం చూపదు. ఫస్టాఫ్ నెమ్మదిగా సాగుతూ కొన్ని సన్నివేశాల్లో మాత్రమే ఆసక్తిని కలిగిస్తుంది. హీరో, విలన్ మధ్య బలమైన పోరాటాన్ని చివరి వరకు దాచడం వల్ల ఉత్కంఠ కొంత తగ్గుతుంది. వీరిద్దరి మధ్య సన్నివేశాలను కథంతటా విస్తరించి ఉంటే మరింత ఆసక్తికరంగా ఉండేది.
సీనియర్ అధికారిగా లాల్ మొదట్లో నవ్వించినప్పటికీ, సెకండాఫ్‌లో ఎక్కువసేపు కనిపించరు. క్లైమాక్స్ సమయంలోనే మళ్లీ తెరపైకి వస్తారు. సూర్య తల్లిదండ్రులకు సంబంధించిన కొన్ని దర్యాప్తు సన్నివేశాలు నమ్మశక్యంగా అనిపించవు. టోవినో థామస్ పాత్రలో ఫర్వాలేదనిపించినప్పటికీ, ఆయన స్థాయికి తగినంత స్క్రీన్ స్పేస్ లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది.
దర్శకుడు జీతూ మాధవన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌కు కామెడీని జోడించిన విధానం ఫర్వాలేదనిపిస్తుంది. వినీత్ అగస్టియన్ సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే అజ్మల్ సాబు ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో మరింత షార్ప్‌గా ఉండాల్సింది. సుషిన్ శ్యామ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. సౌండ్ డిజైన్ కూడా సన్నివేశాలకు అనుగుణంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే కొన్ని చిన్న పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది.
మొత్తంగా 'సీన్' సాధారణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథకు కామెడీ, విచిత్రమైన పాత్రలను జోడించి రూపొందించిన విభిన్నమైన చిత్రం. సూర్య తన నటనతో సినిమాను ముందుండి నడిపించారు. నజ్రియా, నస్లెన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫస్టాఫ్ నెమ్మదిగా సాగడం, విలన్ నేపథ్యాన్ని బలంగా చూపించకపోవడం లోపాలుగా నిలిచినా.. సెకండాఫ్‌లోని వినోదాత్మక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కొత్త తరహా క్రైమ్ కామెడీని చూడాలనుకునేవారికి ఇది ఒకసారి చూడదగ్గ సినిమా.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!