

విజయ్ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం జరగాల్సిన ఆయన ప్రమాణస్వీకారం వాయిదా పడింది. అసెంబ్లీలో మెజార్టీకి అవసరమైన 118 మంది సభ్యుల మద్దతు టీవీకేకు ఇంకా లభించలేదు. పార్టీకి 108 మంది ఎమ్మెల్యేలు గెలిచినా, విజయ్ రెండు స్థానాల్లో విజయం సాధించడంతో ఓటింగ్ పరంగా బలం 107కే పరిమితమైంది. ఇప్పటివరకు భారత జాతీయ కాంగ్రెస్ మాత్రమే తమ ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతును అధికారికంగా ప్రకటించింది. వీసీకే, సీపీఐలు సానుకూల సంకేతాలు ఇచ్చినా ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరోవైపు ఎడప్పాడి కె. పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది.
రాజేంద్ర ఆర్లేకర్ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల పూర్తి జాబితాను కోరినట్లు సమాచారం. అవసరమైన సంఖ్యను టీవీకే సమర్పించలేకపోవడంతో ప్రమాణస్వీకార తేదీపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. బుధవారం విజయ్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు కోసం లేఖ సమర్పించారు. ఇదిలా ఉండగా ప్రమాణస్వీకారానికి రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ “మతతత్వ శక్తులు” కూటమిలో ఉండకూడదని పరోక్షంగా భాజపాను లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం టీవీకే వీసీకే, సీపీఐ, పీఎంకే, ఏఎంఎంకే ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!