

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియడానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉండటంతో కీలక బిల్లుల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)లో సవరణలకు సంబంధించిన బిల్లుల పరిస్థితిపై చర్చ జరుగుతోంది. అయితే సోమవారం లోక్సభ సమావేశాల ఎజెండాలో ఈ బిల్లులకు చోటు దక్కలేదు. ప్రభుత్వం సంప్రదింపులు జరపడంతో డీలిమిటేషన్ అంశంపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరిని కొంత సడలించినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం ఈ ప్రతిపాదనలను అడ్డుకుంటామని స్పష్టం చేసింది.
ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును మార్చి 25న లోక్సభలో ప్రవేశపెట్టినా ఇప్పటివరకు చర్చకు రాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత కె.సి. వేణుగోపాల్ తెలిపారు. మైనారిటీలు, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకునే చట్టాలను అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. సమావేశాలు ముగియడానికి తక్కువ సమయం మాత్రమే ఉండటంతో మిగిలిన కీలక బిల్లులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో తమ ఎంపీలంతా తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరు కావాలని కాంగ్రెస్ ఇప్పటికే విప్ జారీ చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!