

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కోతో వాణిజ్య సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై గతంలో సుంకాలు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు రష్యా నుంచి డీజిల్ దిగుమతులకు మార్గం సుగమం చేశారు. అమెరికాలో పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని ఆయన ప్రభుత్వం చెబుతోంది. ఈ ఒప్పందంలో భాగంగా రష్యా తొలుత 3 లక్షల టన్నులకు పైగా డీజిల్‌ను సరఫరా చేయనుండగా, రానున్న నెలల్లో మరిన్ని సరఫరాలు జరగనున్నాయి. రష్యా డీజిల్ విక్రయాలు, దిగుమతులపై విధించిన ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా 2027 ఏప్రిల్ 7 వరకు సడలించింది. గతంలో రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా భారత్ దిగుమతులపై అమెరికా 25 శాతం అదనపు సుంకం విధించినప్పటికీ, ఇరు దేశాల మధ్య వాణిజ్య అవగాహన అనంతరం 2026 ఫిబ్రవరిలో ఆ అదనపు సుంకాన్ని తొలగించింది.
ట్రంప్ తాజా నిర్ణయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రష్యా ఇంధన ఉత్పత్తుల విక్రయాలపై ఆంక్షలు సడలించడం వల్ల మాస్కోకు ఆదాయం పెరిగి, యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యం బలపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అంతర్జాతీయ ఇంధన సరఫరాలో అంతరాయాలు, అమెరికాలో డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కల్పించడమే తమ లక్ష్యమని ట్రంప్ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. నవంబరులో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఇంధన ధరలను నియంత్రించడం, రష్యాపై ఆర్థిక ఒత్తిడిని కొనసాగించడం, ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడం వంటి లక్ష్యాల మధ్య అమెరికా విధానం సవాళ్లను ఎదుర్కొంటోంది. డీజిల్ సరఫరా పెరగడం ధరలను తగ్గించవచ్చని అమెరికా భావిస్తుండగా, ఆంక్షల సడలింపు రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!