

శాండ్‌పేపర్ గేట్ వివాదంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇటీవల నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ తనను తీవ్రంగా నిరాశపరిచిందని మాజీ ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తెలిపాడు. తన ఆత్మకథలో బాల్ టాంపరింగ్ వ్యవహారంలో కేవలం ముగ్గురు ఆటగాళ్లనే బాధ్యులుగా నిలిపారని, జట్టులోని మిగతా సభ్యులకు కూడా ఈ విషయం తెలుసని ఖవాజా పేర్కొన్నాడు. ఆయన వ్యాఖ్యలు ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి చర్చకు దారితీశాయి. అయితే, ఖవాజా చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని కమిన్స్ కొట్టిపారేశాడు.
కమిన్స్ వ్యాఖ్యలపై స్పందించిన ఖవాజా.. తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం తీవ్రంగా బాధించిందని చెప్పాడు. "ప్యాట్‌ను వ్యక్తిగతంగా నేను చాలా ఇష్టపడతాను. నాయకుడిగా అతడు అద్భుతమైన వ్యక్తి. కానీ, అతడి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని ఊహించలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్‌ను పూర్తిగా చూడాలని అనుకోకపోయినా, అతడు ఏం చెప్పాడో తెలుసుకోవడానికి చూశాను. ఆ సమయంలో నా భార్య రేచల్ పక్కనే ఉంది. నేను బాధలో ఉన్నానని గుర్తించి అడిగినా సమాధానం చెప్పలేకపోయాను. తీవ్ర భావోద్వేగానికి గురయ్యాను. నా సమస్య కమిన్స్‌తో కాదు. క్రికెట్ ఆస్ట్రేలియాలోని కొందరు అధికారులు ముందుకొచ్చి బాధ్యత తీసుకోవాలి. గెలుపే లక్ష్యంగా ఏమైనా చేయాలనే ధోరణి కోచ్‌ల నుంచి ఆటగాళ్ల వరకు విస్తరించింది. ఈ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాను" అని ఖవాజా వివరించాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!