

తెలంగాణలో ప్రస్తుతం ఎదురవుతున్న నీటి సమస్యలు, జలవివాదాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గతంలో తీసుకున్న నిర్ణయాలే కారణమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. వారి హయాంలో జరిగిన ఒప్పందాల వల్ల తెలంగాణ నీటి హక్కులకు నష్టం జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్ది రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుగా నిలుస్తోందని విమర్శిస్తూ.. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం కేంద్రం ముందు బలంగా వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు.
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విషయాన్ని ప్రస్తావించిన సీఎం.. 2004లో ఏర్పాటైన ఈ ట్రిబ్యునల్ అంశం రెండు దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా కొనసాగుతోందని గుర్తుచేశారు. మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో తుది తీర్పు వచ్చేలా ట్రిబ్యునల్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నామని వెల్లడించారు. 512 టీఎంసీల నీటి కేటాయింపుల నేపథ్యంలో తుది తీర్పు తమకు ప్రతికూలంగా మారుతుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ వాయిదాలు కోరుతోందని ఆరోపించారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌తో తాత్కాలిక, దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని కేసీఆర్, హరీశ్‌రావులను ప్రశ్నించారు. వారి నిర్ణయాల వల్లే తెలంగాణ తన నీటి హక్కుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాను లేఖలు రాసినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. కేఆర్‌ఎంబీ అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. గతంలో కేటాయించిన నీటినే వినియోగిస్తున్నామని ఏపీ అధికారులు చెబుతున్నారని, అయితే అవసరమైన అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం సరికాదని తమ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి అధికారుల స్థాయి నుంచి ముఖ్యమంత్రుల స్థాయి వరకు చర్చలు జరిపేలా రోడ్‌మ్యాప్ రూపొందించామని చెప్పారు. కమిటీలు ఏర్పాటు చేసి కేంద్ర జలశక్తి మంత్రితో రెండుసార్లు చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఈ వివాదం ఇద్దరు నేతల మధ్య సమస్య కాదని, రెండు రాష్ట్రాల ప్రజల హక్కులకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!