

పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్‌కు భారతీయ వినియోగదారులు భారీగా ఆసక్తి చూపారు. నిత్యావసర సరుకుల నుంచి బంగారం, వెండి నాణేల వరకు అన్నింటినీ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఇంటివద్దకే తెప్పించుకున్నారు. దీంతో ధన్‌తేరస్, ఛోటీ దీపావళి, దీపావళి సందర్భంగా నవంబర్ 6 నుంచి 8 వరకు ఈ ప్లాట్‌ఫామ్‌లకు మొత్తం 4.4 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. వీటి ద్వారా సుమారు రూ.2,500 కోట్ల స్థూల సరుకుల విక్రయ విలువ (జీఎంవీ) నమోదైనట్లు రెడ్‌సీర్ గణాంకాలు వెల్లడించాయి. గతేడాది దీపావళి సీజన్‌తో పోలిస్తే ఈసారి వ్యాపారం దాదాపు 1.8 రెట్లు పెరిగింది. బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, జియోమార్ట్ క్విక్, అమెజాన్ నౌ, బీబీ నౌ అనే ఏడు ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఈ వివరాలను సేకరించారు. ప్రతి పండుగ రోజున మొత్తం జీఎంవీలో 85–90 శాతం వాటాను నాలుగు అగ్రగామి సంస్థలే సాధించాయి.
ఈ మూడు రోజుల్లో ధన్‌తేరస్ అత్యధిక వ్యాపారాన్ని నమోదు చేసింది. ఆ ఒక్కరోజే సుమారు 1.5 కోట్ల ఆర్డర్లు రాగా.. రూ.850–900 కోట్ల జీఎంవీ నమోదైంది. అంటే సెకనుకు దాదాపు 175 ఆర్డర్లు వచ్చినట్లు లెక్క. గతేడాది ధన్‌తేరస్ రోజున రూ.490 కోట్ల వ్యాపారం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9,500 డార్క్ స్టోర్లలో ఒక్కో స్టోర్‌కు సగటున 1,600 ఆర్డర్లు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ధన్‌తేరస్ రోజు వ్యాపారం 1.8 రెట్లు, ఛోటీ దీపావళి రోజు 1.7 రెట్లు, దీపావళి రోజు 1.9 రెట్లు పెరిగింది. పండుగలకు అనుగుణంగా కొనుగోళ్లలోనూ మార్పులు కనిపించాయి. ధన్‌తేరస్ రోజున స్టీల్ పాత్రల అమ్మకాలు 16 రెట్లు, ప్రెషర్ కుక్కర్లు, క్లీనింగ్ ఉత్పత్తుల విక్రయాలు ఆరు రెట్లు పెరిగాయి. రూ.3,000 నుంచి రూ.14,000 ధరల మధ్య ఉన్న బంగారం, వెండి నాణేలు ఆ రోజు మొత్తం జీఎంవీలో 15–20 శాతం వాటాను దక్కించుకున్నాయి. దీపావళి రోజున పూల అమ్మకాలు ఎనిమిది రెట్లు, పురుషుల సంప్రదాయ దుస్తుల విక్రయాలు 15 రెట్లు పెరిగాయి. స్వీట్లు, దీపాలు, అలంకరణ వస్తువులు, పనీర్‌కు కూడా డిమాండ్ పెరిగింది. వినియోగదారులు సాధారణ కొనుగోళ్లతో పాటు పండుగ అవసరాలను జోడిస్తూ పదేపదే ఆర్డర్లు ఇచ్చారని రెడ్‌సీర్ అసోసియేట్ పార్ట్‌నర్ నిఖిల్ దలాల్ తెలిపారు. భవిష్యత్తులో క్విక్ కామర్స్ రంగం మరింత విస్తరించాలంటే మెట్రో నగరాలతో పాటు చిన్న నగరాల్లోనూ సేవలను విస్తరించడం కీలకమని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!