

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్స్‌లోని సెప్టిక్ ట్యాంక్, మురుగునీటి శుద్ధి కేంద్రం సంపును శుభ్రం చేస్తుండగా విషవాయువులు పీల్చి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కమిషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఈ చర్యలు చేపట్టారు. నవంబర్ 25న పలు పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలను పరిశీలించిన కమిషన్.. తగిన భద్రతా చర్యలు, రక్షణ పరికరాలు లేకుండానే కార్మికులతో ప్రమాదకరమైన శుభ్రపరిచే పనులు చేయించినట్లు వచ్చిన కథనాలపై ఆందోళన వ్యక్తం చేసింది. పారిశుద్ధ్య కార్మికుల భద్రత, ప్రాణరక్షణ, గౌరవం, భద్రతా ప్రమాణాల అమలుపై సమగ్ర వివరాలు సేకరించాలని నిర్ణయించింది.
ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, భద్రతా నిబంధనల ఉల్లంఘనలు, అపార్ట్‌మెంట్ యాజమాన్యం, కాంట్రాక్టర్ బాధ్యతలు, అధికారుల తనిఖీలు, విచారణ, బాధ్యులపై తీసుకున్న చర్యల వివరాలతో నివేదిక సమర్పించాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది. అదేవిధంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఘటనపై విచారణ వివరాలు, మృతుల కుటుంబాలకు అందించిన సహాయం, ఎక్స్‌గ్రేషియా, పరిహారం, బాధిత కుటుంబాల సంక్షేమానికి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని సూచించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టిన నివారణ చర్యలను కూడా నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేసింది. సంబంధిత అధికారులు తమ సమగ్ర నివేదికలను 2026 డిసెంబర్ 22లోగా సమర్పించాలని ఆదేశించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!