

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విపక్ష నేతలను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రజా సమస్యలపై గొంతెత్తిన ప్రజాప్రతినిధులను పోలీసులతో అణచివేయాలని చూడటం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ట్రక్ పార్క్ భూములు వేలాది మంది లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులు, చిరు వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రజా ఆస్తులని పేర్కొన్నారు. ఆందోళన సందర్భంగా అరెస్టయిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు అఖిలపక్ష నాయకులందరినీ తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నగర అవసరాలకు ఉపయోగపడాల్సిన భూములను వేలం వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని కేటీఆర్ తన పోస్టులో ఆరోపించారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములను విక్రయించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. ఈ నెల 27న జరగనున్న ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరని పేర్కొంటూ.. వేలం రద్దు చేసే వరకు బీఆర్‌ఎస్ పార్టీ అఖిలపక్షాలతో కలిసి పోరాటం కొనసాగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!