

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్నెతన్యాహు పై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికా–ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన రహస్య దౌత్య చర్చల ఫలితంగా శాంతి ఒప్పందం తుది దశకు చేరుకున్న సమయంలో లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి మొత్తం ప్రక్రియను దాదాపు పట్టాలు తప్పించిందని ట్రంప్ ఆరోపించారు. నెతన్యాహు చాలా కఠినమైన నాయకుడని, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు శాంతి చర్చలను మరింత క్లిష్టతరం చేశాయని పేర్కొన్నారు.
సాధారణంగా ఇజ్రాయెల్‌కు బలమైన మద్దతుదారుడిగా గుర్తింపు పొందిన ట్రంప్ నేరుగా నెతన్యాహును విమర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ భద్రతకు కీలకమని, ఒకవేళ ఇరాన్ అణ్వాయుధాలను సొంతం చేసుకుని ఉంటే ఇజ్రాయెల్‌కు తీవ్రమైన ముప్పు ఏర్పడేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే బీరూట్‌పై జరిగిన దాడి శాంతి ప్రక్రియను సంక్షోభంలోకి నెట్టిందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.
అమెరికా–ఇరాన్ చర్చల్లో ఇజ్రాయెల్ ప్రత్యక్ష భాగస్వామిగా లేకపోవడం వల్ల ఒప్పందంలోని కొన్ని అంశాలపై అభ్యంతరాలు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్ మద్దతుగల హెజ్బొల్లా వంటి బలగాలపై పోరాటాన్ని కొనసాగించాలనే అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు కూడా నెతన్యాహుపై ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలపై కొత్త చర్చ ప్రారంభమైంది. ఇరాన్ అంశంలో ఇరు దేశాల లక్ష్యం ఒకటే అయినప్పటికీ, దాన్ని సాధించే విధానాల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా దౌత్య చర్చలు, ఒప్పందాలు, ఆంక్షల సడలింపుల ద్వారా సమస్యను పరిష్కరించాలని భావిస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం కఠిన భద్రతా చర్యలు, సైనిక ఒత్తిడి, ముందస్తు దాడుల ద్వారా ఇరాన్‌ను నియంత్రించాలని చూస్తోంది. ఈ వ్యూహాత్మక భేదాలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!