

2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలైన వివిధ ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడు లక్షల మంది లబ్ధిదారులకు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాలను తిరిగి అందజేయనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆయా కుటుంబాలకు తమ ఇళ్లపై యాజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలు అందుబాటులోకి రానున్నాయి.
భూములకు సంబంధించిన 22-ఏ అంశంపై ప్రభుత్వం నిర్వహించిన సమీక్షల్లో పలువురి ఇళ్ల పట్టాలు తహసీల్దార్ కార్యాలయాల్లోనే ఉండిపోయిన విషయం వెలుగులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పట్టాలు అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. 2014కు ముందు అమలైన గృహనిర్మాణ పథకాలలో ప్రభుత్వ రాయితీతో పాటు బ్యాంకు రుణాలు కూడా ఇచ్చేవారని, రుణాలకు భద్రతగా లబ్ధిదారుల ఇళ్ల పత్రాలను తనఖా పెట్టేవారని వివరించారు. రుణాలు చెల్లించినప్పటికీ అనేక మందికి ఆ పత్రాలు తిరిగి అందలేదని, ఇప్పుడు వాటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!