

90వ దశకంలో వచ్చిన అందమైన ప్రేమకథలు, రొమాంటిక్ కామెడీ చిత్రాలను చూస్తూ పెరిగిన తనకు ప్రస్తుతం బాలీవుడ్‌లో అలాంటి ఫీల్‌గుడ్ సినిమాలు కనిపించడం లేదని నటి తాప్సీ పన్ను అన్నారు. ఇటీవలి కాలంలో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆమె.. ప్రస్తుత సినిమాల్లో ప్రేమను చూపించే విధానంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇప్పటి చిత్రాల్లో నటీనటులు ఒకరినొకరు చూసుకుంటూ భావాలను వ్యక్తపరచడం కంటే, కెమెరా ముందు తాము ఎంత అందంగా కనిపిస్తున్నామనే అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలాగే కులం, మతం, తల్లిదండ్రుల అంగీకారం వంటి పాత కథాంశాలతో రూపొందే ప్రేమకథలను మళ్లీ చూడాలనుకోవడం లేదని స్పష్టం చేశారు.
మారుతున్న సాంకేతికతతో పాటు ప్రేమలో పడే విధానం కూడా మారిందని తాప్సీ పేర్కొన్నారు. అందుకే ప్రస్తుత తరం ఆలోచనలు, సమస్యలు, అనుభవాలను ప్రతిబింబించే కొత్త తరహా ప్రేమకథలు రావాలని అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రేమకథలోనూ విషాదకరమైన మలుపు లేదా సామాజిక సందేశం ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తాను నటించిన ‘మన్మర్జియాన్’ తరహాలో స్వచ్ఛమైన ప్రేమకథలో మరోసారి నటించాలని ఉందని వెల్లడించారు. ప్రస్తుత సినిమాల్లో హీరోయిజం లేదా విషపూరితమైన ప్రేమను చూపించడం ఎక్కువైందని, ప్రేమలోని సున్నితమైన భావోద్వేగాలు, నిజాయతీ తగ్గిపోతున్నాయని తాప్సీ అభిప్రాయపడ్డారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!