

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టో తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని, అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలన్నీ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గతంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే మూడేళ్లు గడిచినా హామీల అమలులో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ఆరోపించారు. గొప్పగా చెప్పుకున్న అభయహస్తం ఇప్పుడు శూన్య హస్తంగా మారిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలకు తొలి క్యాబినెట్‌లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి, ఇప్పటివరకు 38 క్యాబినెట్ సమావేశాలు జరిగినా ఆ హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
మేనిఫెస్టోలో 420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటి అమలును విస్మరించిందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేసే కాంగ్రెస్, గాంధీభవన్ సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. ప్రజల ఆశలను ఓట్లుగా మార్చుకుని, అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరిని తెలంగాణ ప్రజలు గుర్తించారని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!