

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ అమలు చేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయింపుల పై గతంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. అయితే నిర్ణీత గడువు ముగిసినా ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని పేర్కొంటూ, స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు.
పిటిషన్లో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని, పార్టీ ఫిరాయింపులను పరోక్షంగా చట్టబద్ధం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల మీడియాతో చేసిన వ్యాఖ్యలను కూడా పిటిషన్లో పొందుపరిచినట్లు సమాచారం. తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీ మారలేదని ఆయన చెప్పడం ద్వారా ఈ అంశంలో స్పష్టత లేకుండా పోతుందని భారతీయ జనతా పార్టీ వాదిస్తోంది.
ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరిస్తుందా, స్పీకర్‌కు నోటీసులు జారీ చేస్తుందా, తుది నిర్ణయానికి మరింత కఠిన గడువు విధిస్తుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!