

పార్టీ ఆవిర్భావం నుంచి జెండాలు మోస్తూ, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పించింది. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా గండాలయపేటకు చెందిన పేరం ఏడుకొండలును ఎంపిక చేసింది. ఆదివారం పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఏడుకొండలు గత పదేళ్లుగా టీడీపీలో అంకితభావంతో పనిచేస్తున్నారు. పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన.. ఏపీ ఎరుకుల సేవా సంఘంలో రాష్ట్రస్థాయి పదవిలోనూ ఉన్నారు. బీఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన ఆయన, వివిధ వృత్తులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ఆయన భార్య లీలావతి శ్రీపానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ఉన్నారు. మేయర్ అభ్యర్థిగా అవకాశం దక్కడంపై ఏడుకొండలు సంతోషం వ్యక్తం చేస్తూ, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
మరోవైపు పొన్నూరు పురపాలక సంఘం ఛైర్పర్సన్ అభ్యర్థిగా కాండ్రు విజయలక్ష్మిని కూటమి ఖరారు చేసింది. ఈ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కూటమి నేతలతో చర్చలు జరిపారు. అనంతరం నేతాజీనగర్‌కు చెందిన కాండ్రు హనుమంతరావు భార్య విజయలక్ష్మి పేరును ఆదివారం రాత్రి ఖరారు చేశారు. హనుమంతరావు 1983 నుంచి టీడీపీలో కార్యకర్తగా కొనసాగుతున్నారు. నిడుబ్రోలుకు చెందిన విజయలక్ష్మి పదో తరగతి వరకు చదువుకున్నారు. గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఛైర్పర్సన్ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా విజయలక్ష్మి స్పందిస్తూ.. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కూటమి నేతల సహకారంతో పొన్నూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!