

తమిళనాడు అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ ప్రతిపక్ష డీఎంకేపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. బ్యాంకు రుణాలకు ఈఎంఐలు చెల్లించినట్టుగా ప్రభుత్వ కాంట్రాక్టర్లు కూడా వాయిదాల పద్ధతిలో లంచాలు చెల్లించాల్సి వచ్చేదని ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పత్రాల్లోని వివరాల ఆధారంగానే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు విజయ్ తెలిపారు. కాంట్రాక్ట్ విలువలో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు పార్టీ నిధుల పేరుతో వసూలు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అప్పటి అధికార పార్టీ డీఎంకేకు చెందిన కీలక నేతలు లబ్ధి పొందారని, ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ తదితరులు ప్రత్యక్ష లబ్ధిదారులని విజయ్ ఆరోపించారు.
ఈడీ నివేదికలో ప్రస్తావించినట్లు చెబుతున్న ‘కరూర్ గ్యాంగ్’ అంశాన్ని కూడా విజయ్ అసెంబ్లీలో ప్రస్తావించారు. కరూర్, కోయంబత్తూర్ సహా పలు జిల్లాల్లోని బార్ యజమానుల నుంచి రాజకీయ నాయకులు డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి సెంథిల్ బాలాజీపై విమర్శలు చేశారు. ఆయన వ్యవస్థీకృత అవినీతి నెట్‌వర్క్‌కు కేంద్రంగా ఉన్నారని ఆరోపించారు. విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేసి, అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపణలను ఖండిస్తూ, ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే విజయ్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!