

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న నీటి సమస్యకు ఎల్‌నినో ప్రభావంతో పాటు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగంలో జరిగిన వైఫల్యాలు కూడా కారణమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ నెల 7న అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ.. తగ్గిన నీటి లభ్యతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సాగునీటి రంగంపై సుమారు రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకున్నప్పటికీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, ఎస్‌ఎల్‌బీసీ వంటి పలు కీలక ప్రాజెక్టులు పూర్తికాలేదని విమర్శించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై గత ప్రభుత్వం చేసిన ప్రచారాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల పరిశీలనల్లో నిర్మాణపరమైన లోపాలు వెలుగుచూశాయని, వాటి ఆధారంగా పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడంతో పాటు రాబోయే వేసవిలో సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా జలాశయాల నిల్వలను జాగ్రత్తగా పరిరక్షిస్తున్నామని తెలిపారు. గత మూడు జల సంవత్సరాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన కృష్ణా జలాలను వినియోగించుకున్నామని, కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కుల కోసం ప్రభుత్వం రాజీపడకుండా పోరాడుతుందని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!