

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలతో నెలకొన్న వివాదంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వివరణ ఇచ్చారు. స్పీకర్ అంటే తనకు ఎంతో గౌరవముందని, తాను ఆయనను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను స్పీకర్‌ను ఉద్దేశించి చేసినవిగా భావిస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నానని, తన మాటలపై విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. తనపై దాడి చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేసిన వారిని ఉద్దేశించే ఆవేశంలో ఆ వ్యాఖ్యలు చేశానని తాతా మధు వివరించారు.
తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా తాతా మధు వ్యాఖ్యలను ఖండించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాతా మధు స్పందించి, స్పీకర్‌ను ఉద్దేశించి తాను మాట్లాడలేదని స్పష్టం చేయడంతో పాటు తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!