

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజా సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహిస్తున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమాజ సేవలో భాగంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులను సన్మానించి వారి సేవలకు గుర్తింపు, గౌరవం కల్పిస్తామని తెలిపారు.
యువతలోని సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ‘ఇన్నోవేషన్ ఛాలెంజ్’ నిర్వహించి కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించనున్నట్లు మాధవ్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో చిత్రలేఖనం, వక్తృత్వం వంటి పోటీలు నిర్వహించడంతో పాటు మొత్తం 13 రకాల కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 17న ఢిల్లీలో దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా భారీ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. మోదీ ప్రజా సేవకు గుర్తింపుగా ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో ప్రజలు ఇళ్ల ముందు దీపాలు వెలిగించి ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారని చెప్పారు. ‘సేవా సంకల్ప్ అభియాన్’ పార్టీ కార్యక్రమం కాదని, ప్రజలందరికీ సంబంధించిన కార్యక్రమమని పేర్కొంటూ కుటుంబాలు, యువత, సేవా సంస్థలు ఇందులో భాగస్వాములు కావాలని మాధవ్ కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!