

దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడంతో భద్రతా చర్యలు ముమ్మరమయ్యాయి. శుక్రవారం మయూర్ విహార్ ఫేజ్-1లోని బలరామ్ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఉదయం 8.40 గంటలకు సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర బృందాలు పాఠశాలకు చేరుకుని తనిఖీలు ప్రారంభించాయి. తరగతి గదులు, కారిడార్లు, ఇతర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల ప్రాంగణంలో తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈ వారంలో ఢిల్లీలోని పలు ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. చాణక్యపురిలోని బ్రిటిష్ స్కూల్, ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధీ ఎస్టేట్‌లోని సర్దార్ పటేల్ విద్యాలయం, ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్, కార్మెల్ కాన్వెంట్ స్కూల్ తదితరాలకు బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించారు. ఈమెయిళ్లు పంజాబీ భాషలో ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు, పాఠశాలలతో పాటు పోలీస్ స్టేషన్లు, పోలీస్ పోస్టులు, కోర్టు సముదాయాలపై దాడుల హెచ్చరికలు ఉన్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 29 వరకు ఢిల్లీ మెట్రో, రైళ్లలో ప్రయాణించవద్దంటూ కూడా హెచ్చరికలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. బెదిరింపులు వచ్చిన ప్రాంతాల్లో భద్రతా బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా, ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!