

గత ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, మరి ఇప్పటివరకు కేసులు నమోదు చేసి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. భూ మార్పిడులు, రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 23 లక్షల ఎకరాల భూ లావాదేవీలు జరిగాయని సీఎం చెప్పిన నేపథ్యంలో ఆయా రిజిస్ట్రేషన్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో ధరణి, ఇప్పుడు భూ భారతి పేరుతో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ప్రభుత్వ స్థలాలు, అటవీ భూములు, అసైన్డ్ భూములు తదితర వివరాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.
భూ వ్యవహారాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, న్యాయ విచారణ జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్ట్ వన్ బీలోని ఐదు లక్షల ఎకరాలను క్లియర్ చేశామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో, అందుకు అనుసరించిన విధానం ఏమిటో వివరించాలని కోరారు. మరోవైపు బీజేపీ శాసనసభా పక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ మాట్లాడుతూ.. 22ఏ నిషేధిత జాబితాలో రైతుల భూములను చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బాధిత రైతుల తరఫున బీజేపీ పోరాడుతోందని, 22ఏ బాధితుల సమస్యలపై ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించినట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!