

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2023లో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని ప్రకటించడంపై ఆయన స్పందించారు. 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదుగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని భూమన పేర్కొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రక్రియకు ప్రయత్నాలు జరిగాయని, కోర్టు వ్యాజ్యాల కారణంగా అది నిలిచిపోయిందని తెలిపారు. జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రక్రియను పూర్తి చేసి, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉచితంగా స్థలాలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని తేలడంతో నామమాత్రపు ధరకు అందించామని పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం సుమారు 1,200 ఎకరాలను సిద్ధం చేసి, పట్టాల పంపిణీ చేపట్టామని తెలిపారు. 2023లోనే ఇళ్ల స్థలాలు ఇచ్చామని, ఆ సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉన్నారని భూమన అన్నారు. టీటీడీ అధికారిక రికార్డుల ప్రకారం 2023లో ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు కల్పించే ప్రక్రియ కొనసాగగా, 2024లో పలు విడతల్లో పట్టాల పంపిణీ జరిగినట్లు నమోదైంది.
చంద్రబాబు తన సుదీర్ఘ ముఖ్యమంత్రి పదవీకాలంలో ఒక్కసారైనా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారా అని భూమన ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు చేసిన ఉద్యోగాలకు సంబంధించిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన విమర్శలు చేశారు. రాయలసీమ వాసులు, తిరుపతి ప్రజలకు తాము ఒక హామీ ఇస్తున్నామని, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని భూమన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!