

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మార్చిన నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఇప్పటివరకు మహాత్మాగాంధీ పేరుతో కొనసాగిన ఈ పథకాన్ని ‘వికసిత్ భారత్ రోజ్గార్ – అజీవికా హామీ మిషన్ (గ్రామీణ్)’ అనే కొత్త పేరుతో కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మార్పును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ పథకానికి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతంలోనే నిరసన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వచ్చే నెల ఫిబ్రవరి 2 న ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బండ్లపల్లి గ్రామంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసన జరగనుంది.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, జాతీయ స్థాయిలో ఈ ఉపాధి హామీ పథకం 2005 లో ప్రారంభమైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2006 ఫిబ్రవరి 2 న అనంతపురంలోనే మొదటిసారిగా అమలులోకి వచ్చింది. అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అదే రోజు, అదే గ్రామంలో – దాదాపు 20 ఏళ్ల తర్వాత, ఇప్పుడు పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి సిద్ధమవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నిరసన కార్యక్రమం జాతీయ స్థాయిలో ఉపాధి హామీ పథకం భవిష్యత్తు పై చర్చను మరింత ఉధృతం చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!