

రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న "సర్వే ప్రక్రియ" నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే ప్రక్రియ పార్టీ భవిష్యత్తుతో పాటు ప్రజల సంక్షేమానికి కూడా అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి నాయకుడు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చురుకుగా పని చేయాలని సూచించారు.
పార్టీ కోసం సమర్థంగా పనిచేయని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరచుకోకపోతే వారం రోజుల్లోనే వారి స్థానంలో చురుకైన నాయకులను నియమిస్తామని హెచ్చరించారు. పార్టీ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేస్తూ, ఈ విషయంలో ఎంత పెద్ద నాయకుడైనా ఉపేక్షించబోమని తెలిపారు. అలాగే ఇన్‌చార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వారిపైనా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.
జిల్లాల వారీగా అవగాహన సదస్సుల నివేదికలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్న ముఖ్యమంత్రి, గ్రామస్థాయిలో మరింత ప్రచారం నిర్వహించాలని సూచించారు. సర్పంచ్‌ల సహకారంతో ప్రజల్లో అవగాహన పెంచి, పేదలకు అందాల్సిన సంక్షేమ ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!