

ఏపీ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత తరచుగా సోషల్ మీడియాలో వీడియోల ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆయన టీడీపీ, వైసీపీ పార్టీలను ఉద్దేశించి ఒక విజ్ఞప్తి చేశారు. ఒక చిన్న తప్పు కారణంగా తాను హీరో నుంచి విలన్ గా మారిపోయానని, అదే బాధతోనే వాలంటరీ రిటైర్మెంట్కు దరఖాస్తు చేశానని ఆయన గతంలోనే చెప్పారు.
తాజా వీడియోలో రాజకీయ కారణాలతో ప్రభుత్వ ఉద్యోగులపై జరుగుతున్న విచ్ హంటింగ్‌ను “క్యాన్సర్ లాంటి సమస్య”గా ఆయన అభివర్ణించారు. గతంలో ఇలాంటి వేధింపులకు గురైన అధికారులు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉండేవారని, అందులో అప్పటి ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ ఒకరని గుర్తు చేశారు. 2014–19 మధ్య ఈ సంఖ్య పది మందికి చేరిందని, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఎక్కువగా ప్రభావితుడయ్యారని చెప్పారు.
ఇటీవలి కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగిందని, మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే పరిస్థితి ఇంకా తీవ్రం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మారిన ప్రతీసారి అధికారులను లక్ష్యంగా చేసుకోవడం మంచిది కాదని స్పష్టం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత టీడీపీ, వైసీపీ పార్టీలదేనని చెప్పారు. గతంలో వైసీపీ పాలన సమయంలో తాను వ్యవహరించిన తీరుపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ప్రవీణ్ ప్రకాష్, ఏబీ వెంకటేశ్వరరావు మరియు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌లకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!