

ఆంధ్రప్రదేశ్‌లో కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ (మోకా) సైట్ క్లియరెన్స్ మంజూరు చేసింది. దీంతో ఈ రెండు విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన తదుపరి చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూములను గుర్తించింది. నిర్మాణానికి అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వానికి పూర్తి యాజమాన్య హక్కులు ఉండే ల్యాండ్‌లార్డ్ విధానంలో చేపట్టాలా? లేక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని అనుసరించాలా? అనే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత మోకాకు సమాచారం అందించి, ఆసక్తి వ్యక్తీకరణకు సంబంధించిన ఆర్‌ఎఫ్‌పీ జారీ చేయనున్నట్లు ఏపీఏడీసీఎల్ ఉన్నతాధికారి వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలు, అనంతపురం, అమరావతి, దగదర్తిలో మొత్తం తొమ్మిది విమానాశ్రయాలను రూ.6,418 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు తాజాగా సైట్ క్లియరెన్స్ లభించింది. శ్రీకాకుళం విమానాశ్రయం మొదటి దశకు రూ.750.52 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, 1,185.56 ఎకరాల్లో ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. 2030 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఏఐ, ప్రైవేటు భాగస్వామ్యం, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేదా పూర్తిగా ఏఏఐ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసే మార్గాలను పరిశీలిస్తున్నారు. కుప్పం విమానాశ్రయం మొదటి దశకు రూ.734 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం 1,788 ఎకరాలను గుర్తించగా, ఇప్పటికే 1,300 ఎకరాలు సేకరించారు. భూసేకరణకు రూ.198.75 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.146 కోట్లు ఖర్చు చేయనున్నారు. రెండు దశల్లో కలిపి ఈ విమానాశ్రయ అభివృద్ధికి రూ.1,142.10 కోట్లు వెచ్చించేలా ప్రతిపాదనలు రూపొందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!