

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల నిరంతరాయ అధికార ప్రస్థానాన్ని కేంద్ర కేబినెట్ కొనియాడింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా ‘దేశమే ప్రథమం.. పౌరులే ప్రథమం’ అనే స్ఫూర్తితో ఆయన సాగించిన ప్రయాణాన్ని ప్రశంసిస్తూ మంగళవారం కేబినెట్ తీర్మానం చేసింది. గుజరాత్‌లో వరుసగా మూడు ఎన్నికల్లో, కేంద్రంలో మూడు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు లభించడం ఆయనపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని తీర్మానంలో పేర్కొంది.
కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు ఎదిగి, 25 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా సేవలందించడం భారత ప్రజాస్వామ్య చైతన్యానికి, గతిశీలతకు నిదర్శనమని ఆయన అన్నారు. స్పష్టమైన విధానాలు, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకత్వానికి ప్రజల మద్దతు ఉంటుందనే విషయాన్ని మోదీ ప్రజా జీవితం చాటిచెప్పిందని కేబినెట్ తీర్మానం పేర్కొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!