

దేశంలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 824కు పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) సిఫార్సు చేసింది. తాజాగా విడుదల చేసిన అధ్యయన నివేదికలో 373 నియోజకవర్గాలను యథాతథంగా ఉంచి, 59 నియోజకవర్గాలను రెండుగా, 111 నియోజకవర్గాలను మూడుగా విభజించాలని సూచించింది. డీలిమిటేషన్ ప్రక్రియలో పట్టణ జనాభా, ఎస్సీ, ఎస్టీ, మహిళల జనాభా, భాషా సమీకరణాలు, భాషా వైవిధ్యం, గత ఎన్నికల పోలింగ్ శాతాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదించింది.
2024 సాధారణ ఎన్నికల నాటికి ప్రతి లోక్సభ నియోజకవర్గంలో సగటున 18.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారని నివేదిక వెల్లడించింది. 2009 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల విశ్లేషణలో చిన్న నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైందని పేర్కొంది. నియోజకవర్గాల సంఖ్యను 824కు పెంచితే దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం 2.32 శాతం పెరిగి అదనంగా 2.23 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాలను మూడేసి భాగాలుగా, చేవెళ్లను రెండుగా విభజించాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్లో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం నియోజకవర్గాలను మూడుగా, మచిలీపట్నాన్ని రెండుగా విభజించాలని సిఫార్సు చేసింది. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 10.66 లక్షల మంది ఉర్దూ మాట్లాడేవారు ఉండగా, వారు మొత్తం ఓటర్లలో 64 శాతం ఉన్నారని నివేదిక వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!